హమ్మయ్యా…! అందుబాటులోకి వచ్చాడు..!!

నెల రోజులకు పైగా స్థానికంగా లేని బోధన్‌ ఎమ్మెల్యే…

దుబాయ్‌ టూర్‌లో బిజీబిజీ… ప్రతిపక్షాల గగ్గోలు..

ఎట్టకేలకు ఆవిర్భావ వేడుకల కోసం లోకల్‌కు వచ్చిన షకీల్‌

నిజామాబాద్‌ ప్రతినిధి – వాస్తవం:

ఇవాళ ఓ పేపర్‌లో ఓ ప్రకటన వచ్చింది. నేను అందుబాటులో ఉంటున్నాను.. ఎవరైనా కలిసే వాళ్లుంటే కలవండని. ప్రకటన ఇచ్చిందెవరో కాదు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌. ఇదొకింత ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే ఆయన నెల రోజులకు పైగా ప్రజలకు అందుబాటులో లేడు. వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్లి ఇవాళ వచ్చాడన్నమాట. రావడానికీ కారణముందండోయ్‌…! జూన్‌2 నుంచి ఆవిర్భావ వేడుకలు. ఇరవై రోజుల పాటు. కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే వచ్చి ఉన్నాడు. ఉండాల్సిందే. కానీ ఆయన తను లోకల్‌లో ఉంటాడనే విషయం చాలా మంది జనం మరిచిపోయి ఉంటారనుకున్నారో..? నేను వచ్చానని చెప్పాలనుకున్నాడో తెలియదు కానీ… పేపర్లో మాత్రం నేను అందుబాటులో ఉన్నాను… వచ్చి కలవండని ఓ ప్రకటన ద్వారా పిలుపునిచ్చాడు. హమ్మయ్య..! అందుబాటులోకి వచ్చావా నాయనా.. అని అనుకోవడం ప్రజల వంతైంది. ఇదీ సంగతన్నమాట.

పార్టీ ప్లీనరీకి కనిపించాడు ఎమ్మెల్యే. ఆ తర్వాత లేడు. రాలేదు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యం కొంటాం.. మీమున్నాం.. కదా రైతులు అధైర్యపడవద్దని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఎక్కడికెళ్లాడో తెలియదు. దుబాయ్‌ అన్నారు. రేపుమాపు వస్తారన చూశారు. ఆఖరికి ఏదో రకంగా తమ బాధలు తాము పడి ధాన్యాన్ని అమ్మేసుకున్నారు. ప్రతిపక్షాలకు ఈ అంశం కలిసొచ్చింది. కనిపించుట లేదు అని ప్రకటించారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇగో ఇప్పుడు ఎట్టకేలకు వచ్చాడు. నేనున్నానంటూ. హమ్మయ్య…! మా ఎమ్మెల్యే బంగారం.. వచ్చాడంట అందుబాటులోకి .. వెళ్లి కలుద్దాం పడండి అని ఎంతో సంతోషపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.

You missed