చేవెళ్లలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెలరేగి పోయాడు. ఇది పక్కా ఎన్నికల కోసం చేసే రెచ్చగొట్టే ప్రసంగాన్ని తలపించింది. ఎక్కడ గెలికితే తమకు ఉపయోగమే.. మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టి పార్టీకి మేలు జరిగేలా చేసుకోవాలో బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అందులో అమిత్‌ షా, మోడీ ద్వయం ఇందులో ఆరితేరింది. ఇక ఇవాళ చేవెళ్ల సభలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తిస్తామనడం పక్కా మత విద్వేషాలు రెచ్చగొట్టి కల్లోలం సృష్టించే మాటలే అనడంలో అతిశయోక్తి లేదు. బీజేపీ సర్కార్‌ ఏర్పడితే పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామనడం కూడా ఇందులో భాగమే.

తాము వస్తే అంతా అభివృద్దే అని చెప్పుకొచ్చిన అమిత్‌ షా… మరి ఇలాంటి మాటలు, చేష్టలు ఎలాంటి అభివృద్దికి, పురోభివృద్దికి సంకేతమో ప్రజలకు చెప్పాలి. కేవలం ప్రజల భావోద్వేగాలే పెట్టుబడిగా బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుందని చెప్పేందుకు అమిత్‌ షా ఇక్కడ చేసిన ప్రసంగమే తాజా ఉదాహరణ. ఇక మున్ముందు ఈ మాటల దాడి, చెలరేగిపోయి రెచ్చగొట్టే స్పీచులు కోకొల్లలుగా ఉంటాయి. ఇదొక రకంగా బీజేపీ ఎన్నికల శంఖారావంగానే చూడాలేమో. అచ్చం అలాగే ఉంది అమిత్‌ షా స్పీచ్‌.

మిగిలిందంతా పాత చింతకాయ పచ్చడి స్పీచే. దమ్ము లేదు. చెప్పేందుకు విషయం లేదు. తామేం చేస్తామో ,చేశామో వివరించి చెప్పేందుకు సరకు లేదు. అందుకే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. విమోచన దినోత్సవం చేస్తాం… అంటూ తమ మతతత్వ అస్త్రాలనే సంధించి పోయాడు అమిత్‌ షా. పేపర్‌ లీకుల గురించి మాట్లాడినా అందులో పెద్దగా విషయం లేదు. ప్రాజెక్టులు, అవినీతి రొటీన్‌..రొటీన్‌.

ఇక కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రధాని కావాలని చూస్తున్నాడని అమిత్‌ షా నోటి నుంచి రావడం ఓ రకంగా కేసీఆర్‌ ఏ స్థాయిలో వారిని డిస్టర్బ్‌ చేశాడో చెప్పకనే చెప్పినట్టయ్యింది అమిత్ షా. అంటే… బీఆరెస్‌ ఏర్పాటు ఉత్తిత్తి కాదు.. బలంగానే విస్తరిస్తున్నదని పరోక్షంగా ఈ గడ్డ మీదకు వచ్చి అమిత్‌ షా ఒప్పుకుని పోయినట్టే భావించాలేమో.

You missed