ఎమ్మెల్సీ కవిత అరెస్టు దాదాపుగా ఖరారు చేసేసేంది కేంద్రం. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో లింకులున్న ఒక్కొక్క వేరును నరుక్కుంటూ వచ్చి.. చివరకు ముందుస్తు వ్యూహంగా కవిత అరెస్టుకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే ముహూర్తం ఖరారు చేసింది. ఈడీ నోటీసులిచ్చింది. రేపు హజరుకావాలని ఆదేశించింది. కవిత తనకు 15 వ రకు చాన్స్‌ ఇవ్వాలని కోరినా.. ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎలాగూ అరెస్టు తప్పదనే సంకేతాలు బీఆరెస్ అధిష్టానానికి ఉన్నాయి. కేసీఆర్‌ వ్యూహంలో భాగంగానే కవిత ఆందోళనలు, ధర్నాలు అన్నీ సిద్దమయ్యాయి. ఎప్పుడు ఏం చేయాలో కూడా అంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. లీగల్‌గా ఎలా అప్రోచ్‌ కావాలో కూడా సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలో రేపు ఈడీ ముందుకు కవిత హాజరుకాగానే అరెస్టు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా కవిత అరెస్టు ఎవరికి లాభం.. ? ఎవరికి నష్టం..? అనే అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎక్కడ చూసినా .. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట వినిపిస్తోంది. అయితే ఇంత వరకు లాక్కొచ్చిన బీజేపీ .. కవిత అరెస్టు విషయంలో పులి మీద స్వారీ చేసినట్టే భావిస్తోంది. ఎందుకంటే అరెస్టు చేయకపోతే.. ఎందుకు చేయలేదు…? అనే అనుమానాలు వస్తాయి. ఇంత మందిని అరెస్టు చేశారు. ఇంతగా దుమ్మెత్తిపోశారు. మరి ఎందుకు అరెస్టు చేయడం లేదు. ఏంటి మత్‌లబ్‌ అనే ప్రశ్నలను ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇచ్చినట్టవుతుంది. అరెస్టు చేస్తే.. సీఎం కూతురు, భారత జాగృతి వ్యవస్థాపకురాలు… దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుని.. అందరి చేత గుర్తింపు పొందిన ప్రముఖురాలిగా ఉన్న ఆమె అరెస్టు బీజేపీని ఎంతగా ఇరకాటంలో పెడుతుంది…? అనేది కూడా ఓ చర్చగా వస్తోంది.

అలాగే ఇది బీఆరెస్‌కు ఎంతలా లాభం చేకూరుస్తుంది..? అనే సమాలోచనలూ నడుస్తున్నాయి. అంతిమంగా తేలేదేమంటే.. కవితను అరెస్టు చేయడం ద్వారా తమ బలాన్ని చూపడంతో పాటు తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పినట్టవుతుందని బీజేపీ భావిస్తోంది. కవిత అరెస్టయితే … ప్రజల వద్దకు బీజేపీ విధానాలను తీసుకెళ్లి.. మరింతగా ప్రజల మద్దతు కూడగట్టుకుని మరింత బలోపేతం కావాలనే ఆలోచనలతో బీఆరెస్‌ ఉంది. ఎవరి అంచనాలు వారికున్నాయి. అయితే బీఆరెస్‌ గా పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత కుట్ర పూరితంగా బీజేపీ , కేంద్రం చేతిలో ఉన్న ఈడీ, సీబీఐలు ఇలా కేసుల పేరుతో రాజకీయంగా భయపెట్టి బలపడాలనే ప్రయత్నాలను, ఉదంతాలను ప్రజల వద్దకు మరింతగా తీసుకెళ్లి.. తమకు అనుకూలంగా పరిస్థితులు మలుచుకోవాలని బీఆరెస్‌ భావిస్తోంది.

You missed