ఈ బడ్జెట్‌ సమావేశాలు కొన్ని అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌కు, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. ఒక దశలో ఈటల కూడా డిఫెన్స్‌లో పడ్డాడు. అసెంబ్లీకి వస్తే ముఖమే చూడను అన్నట్టు రెండు సమావేశాల్లో కూడా ఈటలను ముప్పు తిప్పలు పెట్టిన అధికార పార్టీ ఒక్కసారిగా ప్రేమను ఒలకబోశాయి. ఈటల మావోడంటే మావోడు అంటు..మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావుల నుంచి మొదలుకొని చివరకు ..సీఎం కేసీఆర్‌ కూడా చివరి రోజున అదే మాటలను పల్లవించాడు.ఈటలపై ఒక్కసారిగా ప్రేమ ఒలకబోయడం, వాణి మార్చడం మారుతున్న రాజకీయ పరిణామాలకు ఏమైనా సంకేతమా ..? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈటల రాజేందర్‌ సలహాలను తీసుకోవాలని, ఆయన సూచనలు చాలా బాగున్నాయని, వెంటనే వాటిపై దృష్టి సారించాలని హరీశ్‌రావును సీఎం కేసీఆర్‌ ఆదేశించడం విశేషం. అసలు సభ ప్రారంభమైన నాటి నుంచి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల బాణీ, వాణీ రెండూ మారాయి. ఒకవైపు బీజేపీ పై ధ్వజమెత్తుతూనే, మోడీని తూర్పారబడుతూనే, మరోవైపు ఈటలను ప్రశంసించడం గమనించదగ్గ విషయం. ఈటల రాజేందర్‌తో ఈ సమావేశాలలో మంత్రి కేటీఆర్‌ అత్యంత సన్నిహితంగా మెలగడం అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్న అసెంబ్లీ ఇన్నర్‌ లాబీలో మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి ఈటల మధ్య గంట పాటు సమావేశం జరిగినట్టు అధికార పార్టీ నేతలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. ఒక వ్యూహాత్మకంగా ఈటల ను ఇరకాటంలో పెట్టేందుకు ఇలా చేశారా..? అనే చర్చ జరుగుతుంది.

బలమైన శత్రువులను మిత్రులుగా మార్చుకునే రాజకీయాలలో ఆరి తేరిన బీఆరెస్‌ అధికార పార్టీ అగ్రనాయకులు, అసెంబ్లీ వేదికగా ఒక కొత్త ఎత్తుగడ వేసుండొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌,కాంగ్రెస్‌ లీడర్‌ భట్టి విక్రమార్కతో పాటు మిగితా ప్రతిపక్ష నాయకులంతా బడ్జెట్‌ లోపాలను ఎ త్తి చూపడంలో పూర్తిగా విఫలమయ్యారు.గిరిజన బంధు ప్రతిపాదన లేకపోయినా విద్య,వైద్యానికి సరిగా నిధులు కేటాయించకపోయినా, బీసీ, ఎంబీసీలకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోయినా.. ఎక్కడా కూడా నిర్దిష్టంగా వీటిని ప్రతిపక్ష సభ్యులు ఎత్తి చూపలేదు.

ముఖ్యమంత్రి ఈసారి ఎన్నడూ లేని విధంగా పదివేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను తనకు కేటాయించుకోవడం పట్ల కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించలేకపోయాయంటూ …దీనిపై దుమారం లేపకలేకపోయారు. బడ్జెట్‌లో నిష్టాతుడైన ఈటల రాజేందర్‌ , ఐదు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనుభవం ఉండీ..‌ నిర్దిష్టంగా లోపాలను ఎత్తిచూపలేదనే అపవాదు మూటగట్టుకున్నాడు. ముఖం చూడనని అన్న ముఖ్యమంత్రి, సన్నబియ్యానికి సృష్టికర్త అని సీనియర్ నాయకుడని మంచి అనుభవంగల వాడని, పొగడటం అసెంబ్లీలో శాసన సభ్యులను ఆలోచనలో పడేసింది. మొన్నటి వరకు బద్ద శత్రువుగా ఉన్న రాజేందర్‌ పట్ల వైఖరి మారిందా..? రాజేందర్‌లో మార్పు వచ్చిందా..?? సీఎం పొగడటంతో ఈటల రాజేందర్‌ ఒకదశలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఇరకాటంలో కూడా పడ్డాడు. ఇదంతా మైండ్‌గేమ్ అని, చివరి రోజు సీఎం మైండ్‌ గేమ్‌ ఆడాడని లాబీలో ఆయన విలేకరులతో ఆఫ్‌ ది రికార్డులో వాపోయారు.

తనను పార్టీలో బలహీన పర్చడానికి ఒక ఎత్తుగడగా అభివర్ణించాడు.పార్టీలో ఆలోచనలు మొదలయ్యాయి.రఘునందన్‌ను తిట్టినా కూడా అది కూడా నువ్వు తిట్టినట్టు చెయ్యి.. అన్న చందంగా కొనసాగిందనే వాదనా ఉంది. మొత్తానికి ఈ సమావేశాల్లో ప్రతిపక్షం ఘోరంగా విఫలమైంది. మంత్రి కేటీఆర్‌ ఏకపక్ష బ్యాటింగు కొనసాగింది. ఎవరు లేస్తే వారిపై దుమ్మెత్తిపోయడం చేశాడు. దానికి దీటుగా సమాధానం ఇవ్వడానికి ప్రతిపక్షాలు ఆసక్తి చూపలేదు. పేలవంగా ఉంది వారి వాదన. ఏదీ నాటి పటిమ..? అని ప్రశ్నిస్తున్నారంతా. మొన్నటి వరకు బీజేపీలో కోవర్టులున్నారని ఈటల అన్నాడు. ఈ కోవర్టు ఇష్యూ ఈటలపైకే తెచ్చే విధంగా అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోందా..? అనే అనుమానాలు కూడా వీరి వ్యవహారశైలి రేకెత్తిస్తోంది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చే మూడు లక్షల ఆర్థిక సాయం విషయంలో పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసినా… ఎవరూ దీనిపై మాట్లాడలేదు. నిలదీయలేదు.

బీజేపీలో అయోమయ వాతావరణం సృష్టించడానికి కూడా ఈ వేదికను ఉపయోగించుకున్నారనే వాదన వినిపిస్తోంది.

మ్యాడం మధుసూదన్‌, సీనియర్‌ పాత్రికేయులు….

 

You missed